ప్రవళిక కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలి

04-11-2026 | 09:54pm
  1. ఆర్టీసీ సిబ్బంది రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి
  2. మహిళా ఉద్యోగులకు తగిన రక్షణ చర్యలు చేపట్టాలి.
  3. కండక్టర్ ప్రవళిక మృతి అత్యంత బాధాకరం
  4. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

కొత్తగూడెం : టౌన్ నవంబర్ 4 (విజయకాంతి): విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్(RTC Female Conductor) గుండ్ల ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం(Government) తక్షణమే రూ.కోటి ఆర్థిక పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా డిమాండ్ చేశారు. ఇటీవల ప్రయాణికులు బస్సు కిందకు తోసేయడంతో హైదరాబాద్‌లోని సాయి సంజీవిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బుధవారం కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో అయన పాల్గొన్నారు, ఈ సందర్భంగా ప్రవళిక చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సాబీర్ పాషా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్‌పై దాడి జరిగి ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమన్నారు.

సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టం రూపొందించాలని కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, ఆర్టీసీ ఈయూ గుర్తింపు సంఘం నాయకులు కందుల భాస్కర్, నజీర్, అప్పారావు, సింగ్, కె.ఎస్.కుమార్, రమేష్ బాబు, సురేష్, రవి, సిపిఐ నాయకులు జక్కుల రాములు, కె.హన్మంతరావు, దుర్గ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు