400 కిలోమీటర్ల మహా సైకిల్ యాత్ర విజయవంతం
* మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు ఎనిమిది రోజుల యాత్ర
* కేసీఆర్ ఆశీర్వాదాలతో ముగిసిన యాత్ర
* రైతుల కష్టాలు, ప్రజల అభిప్రాయాలను మూడు గంటలపాటు కేసీఆర్‌కు వివరించిన బృందం
గజ్వేల్, నవంబర్ 4: కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చి రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన 400 కిలోమీటర్ల మహా సైకిల్ యాత్ర విజయవంతంగా ముగిసింది.
బీఆర్ఎస్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, గోదావరిఖని పట్టణ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో అక్టోబర్ 28న మేడిగడ్డ వద్ద ప్రారంభమైన ఈ యాత్ర ఎనిమిది రోజులపాటు వివిధ నియోజకవర్గాలు, గ్రామాలు, కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్ల మీదుగా కొనసాగింది. చివరి రోజు గజ్వేల్ నుంచి ప్రారంభమైన యాత్ర కొండపోచమ్మ సాగర్‌కు చేరుకుని రిజర్వాయర్‌ను సందర్శించింది. అనంతరం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎనిమిది రోజుల యాత్రలో రైతులతో జరిగిన సంభాషణలు, వారు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలు, విద్యుత్ సరఫరా ఇబ్బందులు, ఎరువుల కొరత, కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాలను సుమారు మూడు గంటలపాటు కేసీఆర్‌కు వివరించారు.
ప్రస్తుత ప్రభుత్వంలో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే తమ కష్టాలు తీరుతాయని పలువురు రైతులు ఆకాంక్షించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 8 రోజులపాటు వందల కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణిస్తూ రైతుల సమస్యలను తెలుసుకున్నామని, ప్రతి గ్రామంలో ప్రజలు, రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు అందించిన ఆదరణ మరువలేనిదని యాత్ర నిర్వాహకులు రాజ్‌కుమార్, రవీందర్ తెలిపారు. రైతుల ఆశీస్సులతో ప్రారంభమైన యాత్ర కేసీఆర్ ఆశీర్వాదాలతో విజయవంతంగా ముగియడం సంతోషంగా ఉందన్నారు. ఈ యాత్రలో కాశిపాక వాసు, ఆరెపల్లి సురేష్, ముత్యం లక్ష్మణ్ గౌడ్, పరుపల్లి అనిల్, మేకల నవీన్, గుండబోయిన శ్రీనివాస్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.