దక్కాల్సిన వాటా దక్కుతుంది: సీఎం
హైదరాబాద్: యాదవుల ఆత్మగౌరవం, అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ వేడుకలకు(Sadar celebrations) ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. వారి సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సదర్ సమ్మేళనం కేవలం యాదవుల వేడుక మాత్రమే కాదని, తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవానికి ప్రతీక అని సీఎం అభివర్ణించారు. యాదవుల చిరకాల ఆకాంక్షను గుర్తించి సదర్ వేడుకలకు రాష్ట్ర పండుగ హోదా కల్పించినట్లు గుర్తుచేశారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సమాజం అందించిన సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వంలో యాదవులకు తగిన రాజకీయ, సామాజిక ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా, నవీన్ యాదవ్‌కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించామని వివరించారు. ఈశ్వరమ్మ యాదవ్‌ను యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమించిన విషయాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులోనూ యాదవులకు దక్కాల్సిన అవకాశాలు, వాటా వారికి అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
యాదగిరిగుట్ట గోశాలలో గోవుల సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. తెలంగాణ చరిత్ర, హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను గుర్తుచేస్తూ.. నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను యాదవులు ఆదరించి అక్కున చేర్చుకున్నారని ప్రశంసించారు. గోల్కొండ ప్రాంతానికి ఉన్న చారిత్రక గొల్లంకొండ ప్రస్తావనను కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు.
రాష్ట్రంలో కులగణన చేపట్టి దేశానికి తెలంగాణ ఒక నమూనాగా నిలిచిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. మూసీ పునరుజ్జీవనం, మెట్రో రైలు విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు యాదవ సోదరులు సహకరించాలని కోరారు. వారి ఆత్మగౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు.