కాంగ్రెస్‌కు బిగ్ షాక్
బీఆర్ఎస్‌లోకి హైదర్‌నగర్ అధ్యక్షుడు!
కాంగ్రెస్ నేతలకు గులాబీ ఆహ్వానం.. కేటీఆర్ సమక్షంలో చేరికలు
హైదరాబాద్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అడవులను నరికే వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటుందో.. భూముల వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తే అలా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మియాపూర్ భూముల వ్యవహారాన్ని(Miyapur lands affair) ప్రస్తావించిన కేటీఆర్.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆ భూములపై వివాదం తలెత్తినప్పుడు ప్రముఖ న్యాయవాదిని నియమించి కేసు వాదించామని పేర్కొన్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఆ భూములు ప్రభుత్వానివేనని తీర్పు ఇచ్చిన వెంటనే, వాటిని విక్రయిస్తామని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు అక్టోబర్ 29న మియాపూర్‌లోని సుమారు 550 ఎకరాల భూమిపై ప్రైవేటు వ్యక్తుల వాదనలను తిరస్కరించి, ప్రభుత్వ యాజమాన్యాన్ని సమర్థించింది. ఈ నేపథ్యంలో భూముల భవిష్యత్ వినియోగంపై రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. దామోదర్ రెడ్డి చేరికతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన రాజకీయ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. స్థానికంగా ఈ పరిణామం రాజకీయ చర్చకు దారితీసింది.