విద్యార్థులకు రెండు నెలల డెడ్‌లైన్
హైదరాబాద్: తెలంగాణలో వైద్య విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పటికీ, రాష్ట్రంలోని వైద్య కళాశాలల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. విద్యార్థులు మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి విజన్ 2047, ఫ్యూచర్ సిటీ పేరుతో అమెరికా, చైనా, సింగపూర్ వంటి దేశాలతో పోటీ పడతామని చెబుతున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అయితే రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల పరిస్థితి చూస్తే కనీస వసతుల కల్పనలోనే ప్రభుత్వం వెనుకబడిందని ఆరోపించారు. అభివృద్ధి గురించి ప్రకటనలు చేయడం కంటే విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
మహేశ్వరం మెడికల్ కాలేజీ నిర్మాణం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రాజకీయంగా పేరు వస్తుందనే కారణంతోనే కాలేజీ నిర్మాణాన్ని పక్కన పెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ కాలేజీ నిర్మాణం పూర్తయ్యేదని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన నాలుగు టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ హెల్త్ సిటీ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రాలేదని, ప్రస్తుతం ఓపీ సేవలకే పరిమితమైందని విమర్శించారు.
మూడు రోజులుగా విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరమని హరీశ్ రావు అన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, డీఎంఈ వాణీదేవి వెంటనే విద్యార్థుల వద్దకు వచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గరిష్టంగా రెండు నెలల్లోగా మెడికల్ కాలేజీని వనస్థలిపురం లేదా ఎల్బీనగర్ టిమ్స్‌కు సమీపంలో ఉన్న అన్ని సౌకర్యాలున్న ప్రభుత్వ లేదా అద్దె భవనానికి మార్చాలని హరీశ్ రావు కోరారు. ఈ మేరకు ప్రభుత్వం విద్యార్థులకు తక్షణమే రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ఇకనైనా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని పరిష్కరించాలని సూచించారు.