కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి

04-11-2026 | 06:32pm

ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి

- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్

మల్లాపూర్, నవంబర్ 04 (విజయక్రాంతి): కేసుల దర్యాప్తును వేగవంతం చేసి పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్(SP Ashok Kumar) ఐపీఎస్ పోలీస్ అధికారులకు సూచించారు. మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు.

కేసుల దర్యాప్తును నిబంధనల ప్రకారం సమర్థవంతంగా చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ రికార్డులు, కేసు డైరీలు, వివిధ రిజిస్టర్లను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని సూచించారు.స్టేషన్ పరిధిలో బీట్ వ్యవస్థ, రాత్రి గస్తీ, నేరాల నియంత్రణ చర్యలను సమీక్షించారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, నేరాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు.అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ, కేవైసీ, ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాలపై అప్రమత్తం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కల్పించాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపడం, ప్రమాదకర డ్రైవింగ్, మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ తనిఖీలో మెట్‌పల్లి సీఐ సురేష్ బాబు, మల్లాపూర్ ఎస్‌ఐ అనిల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు