విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలి

04-11-2026 | 07:10pm
  1. విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు 
  2. పట్టణ సీఐ నరహరి కి వినతి

కామారెడ్డి, నవంబర్ 4 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని ఇంద్రచౌక్ వద్ద ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరాగాంధీ విగ్రహాన్ని(Indira Gandhi's statue) గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మాజీ డిసిసి అధ్యక్షులు(Former DCC President of the Congress Party) కైలాస్ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు  నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించిన ఇందిరాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమైన విషయమని, ఇటువంటి ఘటనలు సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉంటాయని నాయకులు పేర్కొన్నారు.

ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని, చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని పట్టణ సీఐ నరహరి కి వినతి పత్రాన్ని అందజేశారు.  ప్రజల మనోభావాలను గౌరవిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోనె శ్రీనివాస్, కౌన్సిలర్లు షేరు, జావిద్, ఇప్ప శ్రీనివాస్  , లడ్డు, సిద్ధిక్ , అజ్మత్, ఖదీర్, విజయ్, చాట్ల రాజేశ్వర్, కాళ్ల గణేష్, సిరాజ్, లక్క పతిని గంగాధర్, రామ్మోహన్, సంతోష్, సుధాకర్ రెడ్డి, రెహాన్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు