రీ సర్వే పనులను పకడ్బందీగా నిర్వహించాలి

04-11-2026 | 02:52pm

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల, నవంబర్ 04 ( విజయ క్రాంతి ): జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి,  తొంబారావుపేట్ గ్రామాల్లో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్(District Collector B. Satya Prasad) బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న రీ సర్వే పనుల పురోగతిని, సర్వే నిర్వహిస్తున్న విధానాన్ని, భూ రికార్డుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రీ సర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే ప్రక్రియను చేపట్టాలని, భూముల హద్దులు, విస్తీర్ణం తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు.

సర్వే సమయంలో ఎదురయ్యే సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రీ సర్వే ద్వారా భూ రికార్డుల్లో ఖచ్చితత్వం ఉండేలా చూడాలని, నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, మేడిపల్లి మండల తహసీల్దార్, సంబంధిత అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు