కేంద్రం నుంచి నిధులను రాబట్టాలి
- రావాల్సిన నిధులపై దృష్టిపెట్టాలి
- వచ్చిన వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి
- కేంద్ర ప్రాయోజిత పథకాల లక్ష్యాలు నెరవేర్చాలి
- ప్రజలకు ఆశించిన ప్రయోజనాలు అందాలి
- కేంద్ర శాఖలతో నిరంతరం సమన్వయం ఉండాలి
- అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి ఉపదేశం
హైదరాబాద్, నవంబర్ ౩(విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల(Centrally sponsored schemes) కింద తెలంగాణకు రావాల్సిన నిధులను రాబట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధికారులకు సూచించారు. అందుకు అన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసి కేంద్రానికి నివేదించాలని చెప్పారు. వచ్చిన నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర పథకాలు(Central Government Schemes), కార్యక్రమాల అమలుపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.
మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర ప్రభుత్వ సెక్టార్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, నిధుల కేటాయింపులు, ఖర్చులు, పెండింగ్ బిల్లులు, రావాల్సిన నిధులపై భట్టి సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి నిధులు పొందేందుకు ఉన్న అన్ని అవకాశాలను శాఖలవారీగా గుర్తించాలని చెప్పారు. అవసరమైన ప్రతిపాదనలను సకాలంలో సమర్పించాలని తెలిపారు. కేంద్ర శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ నిధుల సాధనకు కృషిచేయాలని అధికారులకు దిశా నిర్ధేశం చేశారు.
కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి గరిష్ఠ స్థాయిలో నిధులు రాబట్టుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. కేంద్రం కేటాయించిన నిధులను సమర్థవంతంగా ఖర్చు చేయాలన్నారు. ఆ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా 40 శాతం నిధులను సమకూరుస్తున్నందున, నిధుల ఖర్చుపైనే కాకుండా వాటి ద్వారా సాధిస్తున్న ఫలితాలు, ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపైనా దృష్టి సారించాలని పేర్కొన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే పథకాలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో పనిచేస్తున్న లైజన్ అధికారుల సేవలను అన్నిశాఖల అధికారులు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి నిధుల విడుదల సాధించడంతో పాటు, పెండింగ్ అంశాల పరిష్కారానికి వారితో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వివిధ కేంద్ర మంత్రులకు రాసిన లేఖల్లో ప్రస్తావించిన అంశాలపై కూడా సకాలంలో తదుపరి చర్యలు తీసుకుంటూ, వాటి పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు.
మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు కేంద్రం అందించే ప్రత్యేక సహాయ పథకం (స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) వంటి కేంద్ర కార్యక్రమాలను రాష్ట్రం గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. పథకాల అమలుకు ఆటంకంగా ఉన్న పెండింగ్ సమస్యలు, సాంకేతికపరమైన ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించి ముందుకు తీసుకెళ్లాలన్నారు. ముఖ్యంగా నీటిపారుదల, పట్టణాభివృద్ధి, రవాణా, వ్యవసాయం, వైద్య ఆరోగ్య శాఖలు కేంద్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
తద్వారా ఆయా పథకాల కొనసాగింపునకు, అదనపు నిధుల సాధనకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులను సకాలంలో విడుదల చేస్తున్నామని తెలిపారు. పెండింగ్లో ఉన్న అనేక సమస్యలను కూడా పరిష్కరించామని చెప్పారు.
అన్ని బిల్లులను క్రమశిక్షణతో క్లియర్ చేస్తున్నామని వివరించారు. వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాల ప్రస్తుత పరిస్థితి, పురోగతి, నిధుల వినియోగంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ వివరించారు.