కరువు ప్రభావిత రైతులకు బ్యాంకులు అండగా నిలవాలి
రుణాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలి: కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి,నవంబర్ 04 (విజయక్రాంతి): కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రభావిత మండలాల రైతులకు బ్యాంకుల ద్వారా అవసరమైన ఆర్థిక సహాయం అందించి ఉపశమనం కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ బ్యాంకు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కరువు పరిస్థితులు, పంట రుణాల పునర్వ్యవస్థీకరణపై సమీక్షించారు.
జిల్లాలో కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్, మల్హర్‌రావు, కొత్తపల్లి గోరి మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించినట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ, ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం పంట రుణాల పునర్వ్యవస్థీకరణ చేపట్టి, రైతులకు 12 నెలల మారటోరియం, మొత్తం 36 నెలల వరకు రుణ చెల్లింపు గడువు పొడిగింపు సదుపాయాన్ని కల్పించాలని సూచించారు. రుణాల చెల్లింపుల కోసం రైతులపై ఒత్తిడి చేయవద్దని స్పష్టం చేశారు.
ప్రస్తుత కరువు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్‌లో వరి సాగును సుమారు 38 వేల ఎకరాలకు పరిమితం చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని కోరారు. సమావేశంలో ఎల్‌డీఎం బి. నాగరాజు, బ్యాంకు అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారి బాబు రావు తదితరులు పాల్గొన్నారు.