సాగు నీటి విడుదల కోసం రోడ్డెక్కిన రైతన్న
జన్నారం, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామ రైతులు(Farmers of Chintaguda village) రోడ్డెక్కిన సంఘటన బుధ వారం చోటుచేసుకుంది. మంచిర్యాల - ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై చింతగూడ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపిపి సుతారి వినయ్ మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులు ఈ నెల 7 తేదీ వరకు సాగునీరందిస్తామని, తర్వాత సాగు నీటి సరఫరాని నిలిపివేస్తామని ప్రకటించడం సరికాదన్నారు.
పంటలు ఆలస్యంగా వేసుకున్న రైతులను దృష్టిలో ఉంచుకొని ఈ నెలాఖరు వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సాగునీటి అందించని యెడల మండలంలో పెద్ద మొత్తంలో రైతులు నష్టానికి గురవుతారన్నారు. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపుల అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న జన్నారం ఎస్సై గుర్రం ఉదయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.