రోడ్డుపై నిలిచిన మురుగు

04-11-2026 | 05:20am

బడంగ్‌పేట్ బాలాజీనగర్‌లో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం

రాకపోకలకు స్థానికుల ఇబ్బందులు  

బడంగ్‌పేట్, నవంబర్ 3 (విజయక్రాంతి): మీర్‌పేట్, బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్(Meerpet, Badangpet Municipal Corporation) పరిధిలోని బాలాజీ నగర్ ప్రధాన రహదారిపై(Main Road) మురుగు, వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన డ్రైనేజీ వసతి లేకపోవడం, ఉన్న నాలాలు చెత్తాచెదారంతో పూడిపోవడంతో కొద్దిపాటి వర్షానికే నీరు రోడ్డుపైకి చేరుతోంది.

రాకపోకలకు ఇబ్బందులు..

రహదారి మొత్తం జలమయం కావడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లోకి, ఇళ్ల ప్రాంగణాల్లోకి మురుగునీరు చేరడంతో స్థానికులు దుర్గంధం, దోమల తాకిడితోఅంటువ్యాధుల బారిన పడే ప్రమాదం ఏర్పడింది.

పాఠశాల విద్యార్థుల ఇబ్బందులు..

ఉదయం వేళల్లో బళ్లకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఈ మార్గంలో వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిలిచిన నీటిని సక్షన్ యంత్రాల ద్వారా తొలగించాలని, పూడికతీత పనులు చేపట్టి డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపాలని బాలాజీ నగర్ వాసులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు