మురుసు తుఫాన్‌తో వెంగళరావునగర్‌లో జలదిగ్బంధం

04-11-2026 | 03:17pm
  1. డ్రైనేజీ నీరు, సింగరేణి గోడ కూలడంతో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
  2. ప్రజల ఇబ్బందులు పరిశీలించిన 11వ వార్డు కౌన్సిలర్ మహేంద్ర భాషా

సత్తుపల్లి. నవంబర్ 4. ( విజయ క్రాంతి): మురుసు తుఫాన్( Murusu Cyclone) ప్రభావంతో సత్తుపల్లి పట్టణంలోని వెంగళరావునగర్ 11వ వార్డులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడో నంబర్ రోడ్డులో సింగరేణి గోడ(Singareni Wall) పక్కన ఉన్న డ్రైనేజీని శుభ్రం చేయకపోవడంతో వెంగళరావునగర్ డ్రైనేజీ నీరు సింగరేణి గోడ పక్కనున్న డ్రైనేజీలోకి చేరి పొంగిపొర్లుతోంది. దీంతో సింగరేణి గోడను ఆనుకొని దిగువన ఉన్న ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అంతేకాకుండా, ఎనిమిదో నంబర్ రోడ్డులో సింగరేణి గోడ కూలిపోవడంతో సింగరేణి ప్రాంతం నుంచి వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో 11వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మహేంద్ర భాషా వర్షంలోనే వీధివీధి తిరుగుతూ ప్రజల బాగోగులు, సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

మురుసు తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కౌన్సిలర్ మహేంద్ర భాషా సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే ఫోన్ ద్వారా తనకు తెలియజేయాలని వెంగళరావునగర్ ప్రజలను కోరారు.

వెంగళరావునగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, సంబంధిత అధికారులు, సింగరేణి అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి వెంగళరావునగర్ ప్రజలకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు