గుడ్‌న్యూస్.. మరో రెండేళ్లు సర్వీస్!
న్యూఢిల్లీ: భారత సైన్యంలో సేవ చేయాలనే లక్ష్యంతో అగ్నిపథ్ పథకం ద్వారా ఎంపికైన యువతకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత బయటకు వెళ్లాల్సిన అగ్నివీర్లకు మరో రెండేళ్లు సాయుధ దళాల్లో పనిచేసే అవకాశం కల్పించింది. ఈ మేరకు అగ్నిపథ్ విధానంలో కీలక మార్పులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు వెల్లడైంది. దీంతో ఇప్పటివరకు నాలుగేళ్లకే పరిమితమైన అగ్నివీర్ల సేవా కాలం ఆరేళ్లకు చేరనుంది.
75 శాతం మందికి అదనపు అవకాశం
అగ్నిపథ్ పథకం 2022 జూన్ 14న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ విధానంలో ఎంపికైన యువత నాలుగేళ్ల పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందిస్తారు. అనంతరం ప్రతిభ, పనితీరు ఆధారంగా 25 శాతం మందిని రెగ్యులర్ సర్వీసులోకి తీసుకుంటారు. మిగిలిన 75 శాతం మంది సైన్యం నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే తాజాగా తీసుకొచ్చిన మార్పులతో ఈ 75 శాతం మందికి మరో రెండేళ్లు సైన్యంలో కొనసాగేందుకు అవకాశం లభించనుంది.
రెండేళ్ల తర్వాత పర్మినెంట్ ఉద్యోగాలకు ఛాన్స్
అదనపు రెండేళ్ల సర్వీస్ పూర్తయ్యాక కూడా అగ్నివీర్లకు మరో అవకాశం ఉండనుంది. ఆసక్తి ఉన్నవారు నిర్దిష్ట అర్హతలు, ఎంపిక ప్రమాణాలకు అనుగుణంగా రెగ్యులర్ సాయుధ దళాల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. వారి అనుభవం, నైపుణ్యాలు, పనితీరు ఆధారంగా ఇతర అభ్యర్థులతో పోల్చి ఎంపిక ప్రక్రియ చేపడతారు. అయితే రెండేళ్ల తర్వాత అందరికీ ఆటోమేటిక్‌గా శాశ్వత ఉద్యోగాలు లభించవు. నిర్దేశించిన ఎంపిక ప్రక్రియలో అర్హత సాధించాల్సి ఉంటుంది.
అగ్నిపథ్ పథకం రద్దు కాదు
తాజా మార్పులపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి(CDS General N.S. Raja Subramani) కీలక వివరణ ఇచ్చారు. అగ్నిపథ్ పథకం కొనసాగుతుందని, ప్రస్తుతం అమల్లో ఉన్న మొదటి నాలుగేళ్ల విధానంలో ఎలాంటి రద్దు లేదని స్పష్టం చేశారు. మొదటి నాలుగేళ్లలో రెగ్యులర్ సర్వీసుకు ఎంపిక కాని వారికి మాత్రమే అదనపు రెండేళ్ల అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ విధానం ద్వారా ఇప్పటికే సైనిక శిక్షణ, అనుభవం పొందిన యువతకు మరింత కాలం దేశ సేవ చేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
యువతకు మరింత ప్రయోజనం
ఈ మార్పులతో అగ్నివీర్లకు సైన్యంలో పనిచేసే అనుభవం మరింత పెరగనుంది. సాంకేతిక నైపుణ్యాలు, క్రమశిక్షణ, సైనిక శిక్షణను మెరుగుపరుచుకునేందుకు అదనపు సమయం లభిస్తుంది. అలాగే రెగ్యులర్ సర్వీసులో చేరాలనుకునే వారికి మరో అవకాశం అందుబాటులోకి రానుంది. తాజా నిర్ణయంతో అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో చేరిన యువతకు భవిష్యత్తుపై మరింత స్పష్టత లభించే అవకాశం ఉంది.