రైతులపై తీవ్ర ప్రభావం
క్రూడ్ ఆయిల్ దిగుమతి సుంకం తగ్గింపుతో
దమ్మపేట, సెప్టెంబర్ 25(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం(Central Government) తాజాగా క్రూడ్ ఆయిల్ దిగుమతి సుంకం(Crude oil import duty) 16.5% నుంచి 11% తగ్గించడం వల్ల పామాయిల్ రైతాంగంపై(Oil palm farmers) తీవ్ర ప్రభావం చూపుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ అన్నారు. శుక్రవారం సిఐటియు కార్యాలయంలో(CITU Office) ముఖ్య కార్యకర్తల సమావేశం రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ కేంద్రంలో ఏ పాలకులు వున్నా ప్రపంచ బ్యాంక్ షరుతలకు లోబడి పాలన కొనసాగించటం మూలంగానే వ్యవసాయ రంగం, కార్మిక రంగం(Agricultural sector, labour sector) లపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని అన్నారు.
రాష్ట్రాలలో సైతం పాలక పార్టీలు సరళీకరణ విధానాలు అవలంబించడం వలన విదేశీ పెట్టుబడిదారులు అనుకూలంగా వ్యవసాయ చట్టాల్లో, కార్మిక చట్టాలు మార్పులు చేయటం వలన ఈ రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని అన్నారు. అంతంత మాత్రంగా ఉన్న వ్యవసాయ రంగంలో దమ్మపేట, అశ్వరావుపేట మండలాల్లో రైతులు ఎంతో కష్టపడి పామాయిల్ సాగు చేస్తున్నారని అన్నారు. కానీ ధనిక దేశాల తరపున ట్రంప్ తమ వ్యవసాయ ఉత్పత్తులను భారత్ మార్కెట్లోకి దిగుమతి చేసుకోవడానికి ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకొచ్చి దిగుమతి సుంకాలను తగ్గిస్తున్నారని అన్నారు.
ఈ సుంకాలు తగ్గింపు కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా దేశంలోకి తరలిరావడం వలన వాటి పోటీకి తట్టుకోలేక రైతాంగం విధిలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. పామాయిల్ రంగంలో కూడా దిగుమతి సుంకం అతి త్వరలోనే జీరోకి తీసుకు వస్తున్నారని పామాయిల్ రైతు రోడ్డున పడే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తుందని అన్నారు. సరళీకరణ ఆర్థిక విధానాలు అవలంబించే పాలకులకు వ్యతిరేకంగా రైతాంగం ఉద్యమించడమే ఏకైక మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, నాయకులు సత్యవతి, జయ, ఈశ్వరమ్మ, విక్రమ్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.