భద్రాచలంలో 3వ అదనపు కోర్టు మంజూరు పట్ల హర్షాతిరేకాలు
ఆనందోత్సవాలు జరుపుకుని తీపి పదార్థాలు పంపిణీ చేసిన భద్రాచలం బార్ అసోసియేషన్
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలంలో నూతనంగా 3వ కోర్టుగా "జూనియర్ సివిల్ జడ్జి-కమ్-అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు"ను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు G.O.Ms.No. 59 జారీ చేయడం పట్ల భద్రాచలం బార్ అసోసియేషన్ (Bhadrachalam Bar Association)హర్షం వ్యక్తం చేస్తూ కోర్టు ప్రాంగణంలో స్వీట్స్ పంపిణీ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంత ప్రజల, గిరిజనుల న్యాయ అవసరాలను మరియు భద్రాచలం బార్ అసోసియేషన్ విజ్ఞప్తులను ప్రత్యేక శ్రద్ధతో పరిగణనలోకి తీసుకుని, ఈ నూతన కోర్టు మంజూరుకు సంపూర్ణ సహకారాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించిన గౌరవ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భీమపాక నగేష్ మరియు జస్టిస్ కాజా శరత్ లకు భద్రాచలం బార్ అసోసియేషన్ ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ నూతన కోర్టు సాకారమవ్వడానికి భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొడాలి శ్రీనివాసన్ నాయకత్వంలో, జనరల్ సెక్రటరీ పూసాల శ్రీనివాసాచారి మరియు కార్యవర్గ సభ్యులు నిరంతర శ్రమతో కృషి చేశారు. వారికి పూర్తీ మద్దతును అందిస్తూ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహకరించిన సీనియర్, జూనియర్ న్యాయవాదులందరికీ మరియు ఈ ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆశీస్సులు అందించిన పెద్దలకు బార్ అసోసియేషన్ ప్రత్యేక అభినందనలు తెలియజేసింది.
అలాగే, జీవో జారీ చేసి ఉత్తర్వులు అందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కి, రెవెన్యూ మరియు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు కి బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలిపారు.
భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం భౌగోళికంగా విస్తారమైనదని, సుదూర ప్రాంతాల నుండి వచ్చే గిరిజనులు, పేద ప్రజలకు ఈ 3వ అదనపు కోర్టు ద్వారా కేసుల విచారణ వేగవంతమై త్వరితగతిన న్యాయం అందుతుందని, న్యాయవాదులకు కూడా వృత్తిపరంగా ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం మంజూరైన ఈ అదనపు కోర్టు, భద్రాచలంలో "జిల్లా అదనపు కోర్టు సాధన దిశగా పడిన ఒక బలమైన తొలి అడుగు అని, భవిష్యత్తులో కూడా "న్యాయవాదుల ఐక్యమత్యమే మన బలం మరియు ఆయుధం" అనే నినాదంతో అందరి ఐక్యతతో త్వరలోనే భద్రాచలానికి జిల్లా అదనపు కోర్టును కూడా సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఈ క్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొడాలి శ్రీనివాసన్, జనరల్ సెక్రటరీ పూసాల శ్రీనివాసాచారి, జాయింట్ సెక్రెటరీ తాతా లలిత, మాజీ అధ్యక్షుడు టి. చైతన్య, బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు రావి రామ్మోహన్, వైఎస్ఆర్ శర్మ, అవులూరి సత్యనారాయణ, పా మరాజు తిరుమలరావు, కె అరుణ శ్రీ, ఎంవి రమ, బండారు రమేష్, ఉప్పునాగేంద్ర, దాట్ల సంధ్య, రవితేజ, బీవీ కార్తీక్, బి రామకృష్ణ, కొత్తపల్లి రాంబాబు, గాయత్రి, వై రాజేష్, కోరాడ శ్రీనివాస్, అరవింద్ తదితర న్యాయవాదులుపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.