డ్రోన్ పిచికారితో రైతులకు లాభాలు యువతకు ఉపాధి బాటలు
తలమడుగు,(విజయక్రాంతి): ఆధునిక సాంకేతికతతో సాగు ఖర్చు తగ్గించుకొని అధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah) అన్నారు. శుక్రవారం తలమడుగు మండలం(Talamadugu Mandal) పల్సి (కె)లో పర్యటించిన ఆయన, రైతు ఘన్శ్యామ్ పత్తి చేనులో డ్రోన్ ద్వారా పురుగుమందుల పిచికారీని, డిజిటల్ క్రాప్ సర్వేను పరిశీలించారు. అంతకుముందు గ్రామస్థులు స్వాగతం పలికగా, హనుమాన్, విఠలేశ్వర ఆలయాల్లో పూజలు చేశారు. పాఠశాలలో జరిగిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ... సమీకృత వ్యవసాయం, ఫాంపాండ్లు, పశువుల షెడ్లు, వర్మీ కంపోస్ట్ తో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు.
ఫాంపాండ్ల బలోపేతానికి నిధులు ఇస్తామని, బస్సు సౌకర్యం, పల్సి (కె) - తండా రోడ్డు మంజూరు, డోర్లి రోడ్డు, పంచాయతీ భవనం సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇద్దరు యువకులకు డ్రోన్ పైలట్ శిక్షణ, సీఎస్ఆర్ ద్వారా రూ. లక్ష మార్జిన్ మనీతో రుణం ఇచ్చామని, పోలీస్ ఉద్యోగాలకు 200 మందికి స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి రవీందర్ సింగ్,సర్పంచ్ నైతం చిన్ను, ఎల్డీఎం ఉత్పల్ కుమార్, సైంటిస్టులు రామగోపాల్ వర్మ, రఘువీర్, సురేష్, తహసీల్దార్ రాజ్ మోహన్, ఎంపీడీవో శంకర్, పాల్గొన్నారు.