ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధం
షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): ఎలక్ట్రిక్ స్కూటీ(Electric scooty) షార్ట్ సర్క్యూట్‌కు గురై మంటల్లో దగ్ధమైన ఘటన నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామంలోని మెడ్‌ప్లస్ మెడికల్ షాప్(Medplus Medical Shop) ముందు పార్క్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటీ ప్రమాదవశాత్తు మంటలకు ఆహుతైంది. మెడికల్ షాప్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి రోజువారీ మాదిరిగానే తన ఎలక్ట్రిక్ స్కూటీని షాప్ ముందు పార్క్ చేసి విధుల్లోకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత స్కూటీ నుంచి మంటలు చెలరేగినట్లు గుర్తించారు.
క్షణాల్లోనే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో స్కూటీ పూర్తిగా దగ్ధమైంది.స్కూటీ పార్క్ చేసిన సమయంలో పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే షాప్ సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించే వారు బ్యాటరీ, ఛార్జింగ్ వ్యవస్థపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచించారు. ఎండలో ఎక్కువసేపు వాహనాలను నిలిపి ఉంచడం,బ్యాటరీలో సాంకేతిక లోపాలు వంటి కారణాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.