ఇందిరమ్మ రాజ్యం.. భూరాబందులకు స్వర్ణయుగం
రెవెన్యూ మంత్రి సారీ అంటే సరిపోదు.. రాజీనామా చేయాల్సిందే
భూకుంభకోణంలో మంత్రి పాత్రధారి.. సీఎం సూత్రధారి
హైదరాబాద్: నిషేధిత జాబితాలో( 22A Lands Issue) కోటి ఎకరాల అంశాన్ని ఎండగడతామనే తమను సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆరోపించారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి కుటుంబ సభ్యులు దోపిడీ చేస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం భూరాబందులకు స్వర్ణయుగంలా మారిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో నిషేధిత జాబితాలో 16 లక్షల ఎకరాలు పెట్టారని వివరించారు. మంచిరేవుల భూకుంభకోణం మంత్రి బర్తరఫ్ వరకు వెళ్లిందని స్పష్టం చేశారు.
దేశంలోనే అతి పెద్ద భూకుంభకోణం
దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. కొంగర కలాన్ లో వంద ఎకరాలపై రైతుల భూమిపై కన్నేశారని కేటీఆర్ ఆరోపించారు. ఒక సంస్థకు భూమి కట్టబెట్టి రూ. 1000 కోట్లు కాజేసే కుట్ర చేస్తున్నారని వెల్లడించారు. కొంగర కలాన్ భూముల కుట్రపై ఆ సంస్థకు లేఖ రాయనున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. రెవెన్యూ మంత్రి సారీ అంటే సరిపోదు.. రాజీనామా చేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. భూ కుంభకోణంలో రెవెన్యూ మంత్రి పాత్రధారి.. సీఎం సూత్రధారి అని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని కేటీఆర్ తేల్చిచెప్పారు.
రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం
రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఎవరూ భయపడవద్దన్న కేటీఆర్ అందరం ఐక్యంగా పోరాడదామని పిలుపునిచ్చారు.