ఎర్రవల్లిలో అలజడి సృష్టించే యత్నం
- తోపులాట ఘటనను దళితుల అంశంగా చిత్రీకరించడం సరికాదు
- మర్కుక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ నాయకులు
గజ్వేల్: ప్రజలను రక్షించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) నివాసం ఎర్రవల్లిలో అలజడి సృష్టించేలా వ్యవహరించారని గజ్వేల్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డితో కలిసి శుక్రవారం మర్కుక్ ఎస్‌ఐ యూనస్ మహమ్మద్ అలీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. తోపులాట ఘటనలో అన్ని వర్గాలకు చెందిన వారు ఉన్నప్పటికీ దళితులను అవమానించారంటూ కాంగ్రెస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
దళితుల పేరుతో రెచ్చగొట్టిన కాంగ్రెస్ నేతలు అంక్షారెడ్డి, నర్సారెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, ఖమ్మంపల్లి సత్యనారాయణ తదితరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. దళితులపై నిజమైన ప్రేమ ఉంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు రక్షణగా వెళ్తున్న బీఆర్‌ఎస్ నాయకులను అరెస్టు చేసి, కాంగ్రెస్ నాయకులను ముందుకు తీసుకెళ్లడం సరికాదన్నారు. ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.