అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించడాన్ని ఖండించాలి..

06-10-2026 | 11:12pm

పీ.ఓ.డబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఆర్. సీత

ఆలేరు, అక్టోబర్ 6 (విజయక్రాంతి): అర్హులైన ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండించాలని ప్రగతిశీల మహిళా సంఘం(POW) రాష్ట్ర కార్యదర్శి ఆర్. సీత, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, అఖిల భారత మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జంగమ్మ డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పేరుతో అర్హులైన కోట్లాది మంది ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెబుతున్న పాలకులు, మరోవైపు అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.

ఈ మేరకు అక్టోబర్ 6న భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా వ్యతిరేక ఎస్‌ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను ఎలాంటి షరతులు లేకుండా తిరిగి ఓటరు జాబితాలో చేర్చాలని, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ అధికారులకు మెమొరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పీ.ఓ.డబ్ల్యూ జిల్లా నాయకురాలు, మందనపల్లి ఉపసర్పంచ్ పద్మ శశిరేఖ, జిల్లా నాయకులు తమ్మడి మాధవి, తమ్మడి ఉమా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు