సాగునీటి కోసం ఒక్కటైన శేరుపల్లి రైతులు
శ్రీరంగాపూర్: రైతుల సాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యంగా వనపర్తి జిల్లా(Wanaparthy district) శ్రీరంగాపూర్ మండలం శేరుపల్లి గ్రామ రైతులు(Farmers ) ఐక్యంగా ముందుకు వచ్చారు. గ్రామ సర్పంచ్ మేకల వెంకటయ్య సలహా మేరకు గ్రామ రైతులందరూ కలిసి శ్రీరంగాపూర్ మండల తహసీల్దార్ వరలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా జీవిస్తున్న తమకు సాగునీరు ఎంతో అవసరమని, సరైన సమయంలో నీరు అందకపోతే పంటల సాగుకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని వివరించారు.
రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని రిజర్వాయర్ నుంచి వెంటనే నీటిని విడుదల చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను తహసీల్దార్ వరలక్ష్మి దృష్టికి తీసుకెళ్లగా, ఆమె రైతుల వినతిపై సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపినట్లు రైతులు పేర్కొన్నారు.
రైతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామ సర్పంచ్ మేకల వెంకటయ్య చొరవ తీసుకొని రైతులకు మార్గనిర్దేశం చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ రైతులందరూ ఐక్యంగా తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేసి రైతుల పంటలకు అండగా నిలవాలని గ్రామ రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.