పింఛను దరఖాస్తుల పరిశీలన పకడ్బందీగా చేపట్టాలి
నిర్మల్,(విజయక్రాంతి): పింఛను దరఖాస్తుల పరిశీలన పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వివిధ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... పింఛన్ల దరఖాస్తుల(Pension Applications) ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను ఆయన సమీక్షించారు. దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళలకు సంబంధించి ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.
ఎబిసి సెంటర్ (Animal Birth Control Centre) నిర్వహణకు పటిష్ట ప్రణాళిక రూపొందించాలని వివరించారు. ఎబిసి సెంటర్ ను సమర్థవంతంగా నిర్వహించి, జిల్లాలో కుక్క కాటుల ప్రమాదాలను నివారించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో ఎస్ టిపి నిర్మాణాల వివరాలు సమీక్షించారు. ఎస్ టిపి అనుమతులు, వాటికి సంబంధించిన ఇతర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మున్సిపాలిటీల పరిధుల్లో జరుగుతున్న నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతి పొందిన ఇసుకను మాత్రమే ఉపయోగించేలా మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణ ఉంచాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, డిప్యూటీ కలెక్టర్ రాకేష్, డిఆర్డిఓ విజయలక్ష్మి, డివిఎహెచ్ఓ సురేష్, మైనింగ్ అధికారి తిరుపతి రావు, మున్సిపల్ కమిషనర్లు రవిబాబు, సుందర్ సింగ్, సంతోష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.