గ్రామాల్లో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల, అక్టోబర్ 30 ( విజయ క్రాంతి ): గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ(Water Conservation) పనులను విస్తృతంగా చేపట్టి, భూగర్భ జలాల పెంపుతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్(District Collector B. Satya Prasad) అధికారులను ఆదేశించారు. శుక్రవారం గొల్లపెల్లి మండలంలోని అగ్గిమల్ల, గంగాదేవి పల్లి గ్రామాల్లో పర్యటించి, గ్రామాల్లో చేపడుతున్న నీటి సంరక్షణ పనులు, ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
అలాగే పెగడపెల్లి మండలం నంచర్ల గ్రామంలో ఫామ్ పాండ్ నిర్మాణ పనులను తనిఖీ చేసి, పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం దృష్ట్యా ప్రతి గ్రామ పంచాయతీలో జలసిరి కార్యక్రమం కింద నీటి సంరక్షణ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు.
ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, స్టోన్ ట్రెంచెస్, కాంటూర్ కందకాలు వంటి పనులను అవసరమైన ప్రాంతాల్లో గుర్తించి చేపట్టాలని తెలిపారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు భూమి తేమను కాపాడి వ్యవసాయ ఉత్పాదకత పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వీబిజిరామ్ పథకం కింద రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన పనులను ముందుగానే గుర్తించి, గ్రామాల అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ, గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే పనులకు ప్రాధాన్యతనిస్తూ ఉపాధి హామీ నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ఈ పర్యటనలో డీఆర్డీఓ రఘువరన్, ఆర్డీఓ మధుసూదన్, ఈఈ, డీఈ, రెండు మండలాల ఎంపీడీఓలు, పీఆర్ఏఈలు, ఏపీఓలు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.