స్థానికులకు ప్రత్యేక టోల్ పాస్

30-10-2026 | 01:04pm

టోల్‌ ప్లాజాల సమీపంలో నివసించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన స్థానికులకు ప్రత్యేక వార్షిక పాస్‌ (Concessional Local Pass) అందించనుంది. అయితే ఈ పాస్‌ కోసం ఏడాదికి రూ.1,500 చెల్లించాలనే నిబంధన అన్ని ప్రాంతాలకూ వర్తించదు. టోల్‌ ప్లాజా మున్సిపల్‌ లేదా పట్టణ పరిధి వెలుపల ఉంటే రూ.1,500, ఆ పరిధిలో ఉంటే రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం నవంబర్‌ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది.

టోల్‌ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాణిజ్యేతర వాహనాల యజమానులు ఈ పాస్‌కు అర్హులు. వాహనానికి చెల్లుబాటయ్యే, పనిచేస్తున్న ఫాస్టాగ్‌ (FASTag) ఉండాలి. అది వాణిజ్యేతర వాహనానికి అనుసంధానమై ఉండాలి. అర్హులు ప్రస్తుతం ఉన్న నెలవారీ పాస్‌ లేదా కొత్త వార్షిక పాస్‌లో తమకు అనుకూలమైనదాన్ని ఎంచుకోవచ్చు.

ఈ వార్షిక పాస్‌ ఏ టోల్‌ ప్లాజా కోసం తీసుకుంటే దానికి మాత్రమే వర్తిస్తుంది. ఇతర టోల్‌ ప్లాజాల్లో ఉపయోగించడానికి వీలుండదు. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై క్లోజ్డ్‌ యూజర్‌ ఫీ కలెక్షన్‌ (Closed User Fee Collection) విధానం అమల్లో ఉన్న చోట ఈ సదుపాయం అందుబాటులో ఉండదు. వాహనదారులు వినియోగించేందుకు సర్వీస్‌ రోడ్డు లేదా ప్రత్యామ్నాయ రహదారి ఉన్నచోట కూడా ఈ పాస్‌ జారీ చేయరు.

నవంబర్‌ 1 నుంచి అర్హత కలిగిన టోల్‌ ప్లాజాల వద్ద వార్షిక పాస్‌ అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌ 1 నుంచి రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌ (Rajmargyatra App) ద్వారా కూడా పొందవచ్చు. ఈ నిబంధనలను కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సవరించిన జాతీయ రహదారుల ఫీజు నిబంధనల ద్వారా అమల్లోకి తీసుకొచ్చింది. తరచూ ఒకే టోల్‌ ప్లాజా మీదుగా ప్రయాణించే అర్హులైన స్థానికులకు ఈ విధానం ఆర్థికంగా ఊరటనివ్వనుంది.

మరిన్ని వార్తలు