తూనికలు - కొలతల అధికారుల తనిఖీలు
నిర్మల్ అక్టోబర్ 30) విజయ క్రాంతి): నిర్మల్ పట్టణంలోని పలు వ్యాపార సంస్థలపై తూనికలు - కొలతల (లీగల్ మెట్రాలజీ) శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన రెండు వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి పి. శంకర్(Legal Metrology Officer P. Shankar) తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని వ్యాపారస్తులందరూ ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి తమ వ్యాపారాలను నిర్వహించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. వ్యాపార సంస్థల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు, కాండా బాట్లు, ఇతర తూనిక పరికరాలకు నిర్ణీత గడువులోగా ఎప్పటికప్పుడు స్టాంపింగ్ చేయించుకోవాలని అన్నారు.
అలాగే, వస్తువులను ప్యాకింగ్ చేసి విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా ప్యాకింగ్ లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే తమ వ్యాపారాన్ని కొనసాగించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారస్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. జిల్లాలోని ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, లీగల్ మెట్రాలజీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.