పల్లెల అభివృద్ధికి సీతక్క మాస్టర్ ప్లాన్!

30-10-2026 | 12:34pm

హైదరాబాద్‌: తెలంగాణలోని పల్లెల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామపంచాయతీని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా GPSAP-2026 పేరుతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. మంత్రి సీతక్క ఆలోచన, ఆదేశాల మేరకు సిద్ధమైన ఈ ప్రణాళిక ద్వారా ప్రతి గ్రామానికి ప్రత్యేక అభివృద్ధి రోడ్‌మ్యాప్‌ (Development Roadmap) తయారు చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా విధానాన్ని రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

గ్రామాల అభివృద్ధికి ముందుగా అక్కడి పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి ప్రత్యేక ప్రొఫైల్‌ (Village Profile) సిద్ధం చేస్తారు. జనాభా, కుటుంబాల సంఖ్య, ఉపాధి అవకాశాలు, గృహవసతి, పశుసంపదతో పాటు ప్రభుత్వ పథకాల అమలు తీరుకు సంబంధించిన వివరాలను సేకరిస్తారు. ఈ డేటా (Baseline Data) ఆధారంగా ఏ గ్రామానికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో గుర్తించనున్నారు.

కేవలం ప్రస్తుత అవసరాలకే పరిమితం కాకుండా రాబోయే మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు గ్రామాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించనున్నారు. దీనికి అదనంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక వార్షిక ప్రణాళిక సిద్ధం చేస్తారు. గ్రామాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులతో పాటు దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ప్రతి గ్రామానికి ఒకే తరహా అభివృద్ధి నమూనాను అమలు చేయకుండా, ఆయా గ్రామాల అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా పనులను ఎంపిక చేయనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం (Inter-departmental Coordination) పెంచుతూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లనున్నారు.

మొత్తంగా GPSAP-2026 ద్వారా గ్రామాల అభివృద్ధికి పక్కా ప్రణాళిక, స్పష్టమైన లక్ష్యాలు, ప్రత్యేక కార్యాచరణ అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రణాళిక కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలైతే తెలంగాణ పల్లెల అభివృద్ధికి కొత్త దిశ లభించనుంది.

మరిన్ని వార్తలు