ఇంటింటి సర్వేతోనే కుష్టు వ్యాధిని అరికట్టవచ్చు
లెప్రసీ సర్వే పరిశీలన రాష్ట్ర అబ్జర్వర్ డా. రాజు
జగిత్యాల,(విజయక్రాంతి): ఇంటింటి సర్వేతో కుష్ఠు వ్యాధి(Leprosy)ని అరికట్టవచ్చని కుష్ఠు వ్యాధి సర్వే పరిశీలన రాష్ట్ర అబ్జర్వర్ డాక్టర్. రాజు తెలిపారు. జగిత్యాల జిల్లా కల్లెడ పి హెచ్ సి పరిధిలోని దరూర్ సబ్ సెంటర్ ను శుక్రవారం ఎల్సీడీసీ ప్రోగ్రామ్ రాష్ట్ర అబ్జర్వర్ డా. రాజు సందర్శించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న LCDC (Leprosy Case Detection Campaign) కార్యక్రమాన్ని ఆయన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్.సుజాత, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్. శ్రీనివాస్ లతో కలిసి పరిశీలించారు.
ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి చేస్తున్న సర్వే తీరును, నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించి, లెప్రసీ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డా. రాజు మాట్లాడుతూ "కుష్టు వ్యాధి పూర్తిగా నయం చేయదగిన వ్యాధని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే శాశ్వత వైకల్యాలను నివారించవచ్చని, శరీరంపై స్పర్శ లేని మచ్చలు, తిమ్మిర్లు, బుడిపెలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గర లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి రావాలని సూచించారు. పరీక్షలు, మందులు అన్నీ ఉచితంగా ఇస్తున్నామన్నారు.
ఆశా వర్కర్లు చేస్తున్న ఇంటింటి సర్వేకు ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. కుష్టు వ్యాధి చికిత్స ఆలస్యం చేస్తే నరాలు దెబ్బతిని చేతులు, కాళ్లు వంకరగా మారే ప్రమాదం ఉందని, అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ రాజు అవగాహన కల్పించారు.