కీతవారిగూడెంలో కార్తీక పౌర్ణమి వేడుకల్లో ఆధ్యాత్మిక శోభ

24-11-2026 | 06:44pm

శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా కోటి దీపోత్సవం

గరిడేపల్లి నవంబర్ 24, (విజయ క్రాంతి): కార్తీక పౌర్ణమి(Karthika Pournami) పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలో మంగళవారం కీతవారిగూడెం, పొనుగోడు, గరిడేపల్లి, శివాలయాలు శివనామస్మరణలతో మారుమోగాయి కీతవారిగూడెంలో శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

భక్తులు తెల్లవారుజామునుంచే ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఆలయ అర్చకులు శ్రీ రాయప్రోలు శ్రీరామయ్య శర్మ, స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన, సహస్రనామార్చన నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమార్చనతో పాటు వివిధ హారతులు సమర్పించారు.

కీతవారిగూడెంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకొని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. పలువురు భక్తులు స్వయంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ట్రస్టు అధ్యక్షులు, కమిటీ సభ్యులు భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేలాది దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలు దేదీప్యమానంగా వెలిగిపోగా, ఆ దృశ్యం భక్తులను కనువిందు చేసింది. భక్తుల శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచాయి.

మరిన్ని వార్తలు