బండి సంజయ్‌పై అడ్లూరి ఫైర్
హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) అంశంపై తెలంగాణలో రాజకీయ విమర్శలు మరింత వేడెక్కాయి. ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Minister Adluri Laxman) ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ ఆధారాలతో సహా వివరించారని అడ్లూరి పేర్కొన్నారు.
ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీజేపీ అగ్రనేతలు తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay)ను ఉద్దేశించి అడ్లూరి పలు ప్రశ్నలు సంధించారు. రెండుసార్లు ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు ఆయన చేసిన అభివృద్ధి ఏమిటని నిలదీశారు. దేవాలయాల అభివృద్ధికి కేంద్రం నుంచి ఎప్పుడైనా నిధులు తీసుకొచ్చారా? తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధుల వాటాను సాధించారా? అని ప్రశ్నించారు.
ఎస్ఐఆర్ అంశంపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అడ్లూరి స్పష్టం చేశారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది.