కాలుష్య కాసారంగా మారిన డంపింగ్ యార్డ్ ను ఎత్తివేయాలి

24-11-2026 | 06:44pm

డంపింగ్ భూతానికి... బలైన జవహర్ నగర్ ను ఆదుకోవాలి.                       

పోరాట కమిటీ దీక్షకు టీచర్స్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు.                              

ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్...

జిల్లా అధ్యక్షుడు కర్నేసురేందర్..                     

జవహర్ నగర్, నవంబర్ 24 (విజయక్రాంతి): కాలుష్య కాసారంగా మారిన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్(Jawahar Nagar Dumping Yard)ను వెంటనే ఎత్తివేయాలని డంపింగ్ భూతానికి బలైన జవహర్ నగర్ ను అన్ని విధాల ఆదుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కర్నే సురేందర్ డిమాండ్ చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో నెలకొని ఉన్న డంపింగ్ యార్డ్ ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చిన్నాపురం చౌరస్తా వద్ద డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి మూడవ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా కమిటీ సందర్శించి పోరాట కమిటీకి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది.

ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కర్నే సురేందర్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ కారణంగా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయాయని తాగునీరు సాగునీరు విషతుల్యంగా మారిందని తెలిపారు. కాలుష్య ప్రభావంతో ఇక్కడి ప్రజల సగటు ఆయు ప్రమాణం తగ్గిపోయి 60 ఏళ్లు నిండకముందే మృత్యువాత పడుతున్నారని ఇటీవల కాలంలోనే సుమారు ఆరుగురు మరణించడం బాధాకరమన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తరలించి జవహర్ నగర్ వాసులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకన్న, ఏఐఎఫ్టీయూ మల్లేష్, నాయకులు శివ బాబు, దుర్గయ్య సురేందర్, సావిత్రి, నరసింహారెడ్డి, ప్రపుల్ తో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు స్థానికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు