వైభవంగా లింబాద్రిగుట్ట నింబాచలుడి రథోత్సవం

24-11-2026 | 06:41pm

భక్తజన సందోహంతో కిటకిటలాడిన నింబాచల క్షేత్రం.. గోవింద నామస్మరణలతో మార్మోగిన కొండ

బోధన్, నవంబర్ 24 (విజయ క్రాంతి): భీమగల్ లింబాద్రిగుట్టపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీనృసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy) వారి రథోత్సవం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. ఏడాదికొకసారి రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చే నింబాచలుడిని కనులారా దర్శించుకునేందుకు భీమగల్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు లింబాద్రిగుట్టకు తరలివచ్చారు.

స్వామివారి రథోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గోవింద నామస్మరణలు, స్వామివారి జయజయధ్వానాల మధ్య భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగారు. మహిళలు, యువకులు, వృద్ధులు అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

రథంపై కొలువుదీరిన లక్ష్మీనృసింహస్వామివారిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. ఎటుచూసినా భక్తజన సందోహం, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో నింబాచల క్షేత్రం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో లింబాద్రిగుట్ట పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రథోత్సవం భక్తులకు కనులపండువగా నిలిచింది.

మరిన్ని వార్తలు