హుజూరాబాద్‌లో బూడిదైన ఇల్లు!
8 తులాల బంగారం, రూ.80 వేల నగదు సహా విలువైన వస్తువులు దహనం.
హుజూరాబాద్,నవంబర్ 24:(విజయక్రాంతి): దైవదర్శనం కోసం కుటుంబమంతా అరుణాచలం(Arunachalam) వెళ్లారు. ఇంటికి తాళం వేసి భక్తితో యాత్రకు(Journey) బయలుదేరిన ఆ కుటుంబానికి ఊహించని విషాదం ఎదురైంది. వారు తిరిగి వచ్చేలోపే ఇంట్లో మంటలు చెలరేగి విలువైన సామగ్రితో పాటు బంగారం, నగదు అగ్నికి ఆహుతయ్యాయి. కష్టపడి నిర్మించుకున్న ఇల్లు, వస్తువులన్నీ కళ్లముందే బూడిద కావడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరైంది.
హుజూరాబాద్ పట్టణంలోని 13వ వార్డు ఇందిరానగర్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కొండ్ర స్వామి కుటుంబంతో కలిసి అరుణాచలం దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంటి నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంట్లోని ఏసీ, ఫ్రిజ్, ఇతర గృహోపకరణాలు, విలువైన వస్త్రాలు పూర్తిగా కాలిపోయాయి. బీరువాలో భద్రపరిచిన సుమారు 8 తులాల బంగారం, రూ.80 వేల నగదు సైతం మంటలకు ఆహుతైనట్లు బాధితులు తెలిపారు.
విషయం తెలుసుకున్న కొండ్ర స్వామి అరుణాచలం నుంచి హుటాహుటిన హుజూరాబాద్‌కు బయలుదేరారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన కుమారులు కూడా ఇంటికి చేరుకుని కాలిపోయిన సామగ్రిని చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ రొoటాల సుహాసిని స్థానిక కౌన్సిలర్ చందమల్ల పుణ్య, బాబు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. జీవితకాలం కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తి ఒక్కసారిగా బూడిద కావడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని 13వ వార్డు కాలనీవాసులు కోరుతున్నారు.