50 కోట్ల మంది యువతే టార్గెట్: కిషన్ రెడ్డి

24-11-2026 | 12:50pm

హైదరాబాద్: దేశ యువత భవిష్యత్తును డ్రగ్స్(Drug) మహమ్మారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి(Union Minister G. Kishan Reddy) అన్నారు. మత్తు పదార్థాల వినియోగం యువతను నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra modi) ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారని తెలిపారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన నషా ముక్త్ భారత్ కార్యక్రమం(Nasha Mukt Bharat Campaign )లో ఆయన మాట్లాడుతూ.. పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్య తీవ్రంగా మారిందని, అక్కడి పరిస్థితులు ఇతర రాష్ట్రాలకు హెచ్చరికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వ చర్యలతో పాటు కుటుంబాలు, విద్యాసంస్థలు కూడా బాధ్యత తీసుకోవాలని సూచించారు.

విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని కేంద్రం భావిస్తోందని కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలహీనపడటం, యువతకు కుటుంబ మద్దతు తగ్గడం వంటి అంశాలు కూడా సమస్యను ప్రభావితం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా ప్రోత్సహించాలని కోరారు.

మత్తు పదార్థాల వినియోగదారులను మాత్రమే కాకుండా వాటి ఉత్పత్తి, అక్రమ రవాణా, సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకోవాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సరిహద్దుల్లో తనిఖీలను మరింత పటిష్ఠం చేయడంతో పాటు మాదకద్రవ్యాల గుర్తింపునకు జాగిలాల సంఖ్యను పెంచుతున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక యాంటీ డ్రగ్ విభాగాలను బలోపేతం చేస్తామని చెప్పారు.

దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి నషా ముక్త్ భారత్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఈగల్ బృందం డ్రగ్స్ నియంత్రణకు సమర్థంగా పనిచేస్తోందని ప్రశంసించారు. యువత, తల్లిదండ్రులు డ్రగ్స్ ఫ్రీ వారియర్స్‌గా మారి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు