అర్హులైన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత భీమా భరోసా
- కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి
చెన్నూర్, (విజయక్రాంతి): రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి(Minister Gaddam Vivek Venkataswamy) అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ మండలం గంగారం గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం నమోదు కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్, జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) అజ్మత్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ తివారిలతో కలిసి హాజరై మాట్లాడారు.
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పేదల సంక్షేమం కోసం గరీబీ హటావో నినాదంతో ఇందిరమ్మ ఇండ్లు, అసైన్డ్ భూముల పంపిణీ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, గతంలో రైతులకు మాత్రమే పరిమితమైన రైతు భీమా పథకాన్ని మరింత విస్తరించి, రాష్ట్రంలో కోటి మందికి పైగా ప్రజలకు జీవిత భీమా భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని అమలు చేస్తుందన్నారు.
గంగారం గ్రామంలో సుమారు 450 కుటుంబాలకు ఈ పథకం ద్వారా భీమా భద్రత కల్పించడం జరుగుతుందని, కుటుంబంలో సంపాదించే వ్యక్తికి అనుకోని ప్రమాదం సంభవించి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా 5 లక్షల రూపాయల భీమా పరిహారం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. 10 సంవత్సరాల తర్వాత గంగారం గ్రామానికి మొదటి విడతలో 28 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, 25 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. గ్రామంలో ఇంకా 35 ఇండ్లు అవసరమని అధికారులు గుర్తించారని, అందులో 20 ఇండ్లను తక్షణమే మంజూరు చేయిస్తామని, మిగిలిన 15 ఇండ్లను 3, 4 నెలలలో సమీక్షించి మంజూరు చేయిస్తామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు అల్పాహార పథకాన్ని ప్రారంభించామని, వారంలో 5 రోజులు ఇడ్లీ, పూరీ, సెట్ దోశ, ఉప్మా వంటి అల్పాహారాన్ని అందించడం జరుగుతుందని మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
గంగారం గ్రామ అభివృద్ధికి ఇప్పటికే సుమారు 50 లక్షల రూపాయల వరకు సిఎస్ఆర్ నిధులు, ఇతర అభివృద్ధి నిధులు సమకూరాయని, వచ్చే ఏడాది మరో 15 నుంచి 20 లక్షల రూపాయలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో సి.సి. రోడ్లు, మురుగు కాలువలు, హైమాస్ట్ లైట్లు, త్రాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మిషన్ భగీరథ ద్వారా నిరంతర త్రాగునీటి సరఫరాకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలో పంచాయతీరాజ్, ఆర్ & బి శాఖల ద్వారా పెద్ద ఎత్తున రహదారుల అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
గంగారం నుంచి ఊతుపల్లి వరకు 3 కోట్ల రూపాయలతో బి.టి. రోడ్డు నిర్మాణం పూర్తయిందని, ఇతర రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా 70 కోట్ల రూపాయలు, హామ్ క్రింద సుమారు 80 కోట్ల రూపాయలు, ఆర్ & బి శాఖ ద్వారా 63 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, గోదావరి పుష్కరాల పనులకు 70 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
నియోజకవర్గంలోని సోమనపల్లి ప్రాంతంలో సుమారు 200 కోట్ల రూపాయలతో 2 వేల 500 మంది విద్యార్థులకు వసతి సౌకర్యంతో కూడిన పాఠశాల నిర్మాణం చేపడుతున్నామని, చెన్నూర్ లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందని, త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రికి 20 మంది వైద్యులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గంగారం గ్రామంలో అభివృద్ధి పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం నమోదు ప్రక్రియ జిల్లాలో కొనసాగుతుందని, రేషన్ కార్డులో నమోదై ఉన్న 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన కుటుంబ సభ్యులలో కుటుంబానికి ఒక సంపాదించే వ్యక్తిని భీమా కోసం ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఎంపిక చేసిన భీమా పొందే వ్యక్తికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి మరణిస్తే, ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల భీమా పరిహారం అందుతుందని తెలిపారు. కుటుంబ సభ్యులే నామినీలుగా ఉండి, వారికి అందవలసిన భీమా పరిహార వాటాలను కుటుంబ సభ్యులు నిర్ణయించి అధికారులకు తెలియజేయాలని సూచించారు.
నమోదు ప్రక్రియ పూర్తయిన వెంటనే సంబంధిత వ్యక్తి మొబైల్కు దరఖాస్తు సమర్పించినట్లుగా సందేశం వస్తుందని, అందులో భీమా పొందే వ్యక్తి, నామినీల వివరాలు, వారికి అందే పరిహారం వాటాల వివరాలను తెలుసుకోవచ్చని, ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే రైతు భీమా, మత్స్యకారులు, గీత కార్మికులకు సంబంధించిన ఇతర భీమా పథకాల వివరాలను సేకరించి, ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం పరిధిలో సమగ్రంగా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య భద్రత కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సహాయం అందిస్తుందని, జీవిత భీమా ద్వారా కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తుందని తెలిపారు.
జిల్లాలో అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకంలో నమోదు చేసుకునేలా సంతృప్త స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో నిర్వహించే ప్రత్యేక శిబిరాలలో నమోదు చేసుకోవాలని, ఎవరైనా మిగిలిపోయినట్లయితే మండల కార్యాలయంలో ప్రత్యేకంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.