ఎర్రజెండా నీడలోనే తుది శ్వాస
కామ్రేడ్ లక్ష్మీనారాయణకు విప్లవ జోహార్లు
గరిడేపల్లి,(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet district) గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకుడు కామ్రేడ్ భాగం లక్ష్మీనారాయణ(Comrade Bhagam Laxminarayana) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పార్థివదేహంపై పార్టీ సీనియర్ నాయకుడు పోటు వెంకటేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు పార్టీలో కొనసాగిన లక్ష్మీనారాయణ సేవలు మరువలేనివని కొనియాడారు.
స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్న ప్రస్తుత తరుణంలో, ఎర్రజెండా నీడలోనే కొనసాగుతూ గ్రామంలో పార్టీకి అండగా నిలిచారని గుర్తుచేశారు.కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మైఖేల్, పోటు చిన్న వెంకటేశ్వర్లు, అఖిల భారత రైతు కూలీ సంఘం డివిజన్ నాయకులు పారెల్లి నాగయ్య, మేకల కనకారావు, పోటు కోటేశ్వరరావు, పోటు మోహన్రావు, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.