సైబర్ నేరాలపై గజ్వేల్‌లో భారీ ఫ్లాష్ వాక్
1,500 మందికి పైగా విద్యార్థులతో టార్చ్‌లైట్ ర్యాలీ
డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరిస్తే నమ్మొద్దు
సైబర్ మోసాలకు గురైతే 1930కు ఫిర్యాదు చేయండి: సీపీ రష్మి పెరుమాళ్
గజ్వేల్: సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గజ్వేల్ పట్టణంలో శుక్రవారం భారీ ఫ్లాష్ వాక్ నిర్వహించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ నాయకత్వంలో గజ్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి బసవేశ్వర విగ్రహం వరకు, అక్కడి నుంచి తిరిగి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు 1,500 మందికి పైగా విద్యార్థులు చేతుల్లో టార్చ్లైట్లు పట్టుకుని ఉత్సాహంగా పాల్గొన్నారు.
పట్టణ ప్రధాన రహదారిపై సాగిన ర్యాలీలో 'పాజ్, స్టాప్, వెరిఫై', 'సైబర్ హెల్ప్‌లైన్ 1930', 'నో డిజిటల్ అరెస్ట్' నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ లేదని, ఆ పేరుతో ఫోన్ చేసి బెదిరించే మోసగాళ్లను నమ్మవద్దని సూచించారు. బ్యాంకు అధికారులమని చెప్పి ఓటీపీ అడిగినా ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు.
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఏ సమాచారాన్నైనా ధ్రువీకరించుకున్న తర్వాతే స్పందించాలని సూచించారు. సైబర్ మోసాల వల్ల కష్టపడి సంపాదించిన డబ్బును ప్రజలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు, సైబర్ క్రైమ్ డీఎస్పీ రాజు, పట్టణ సీఐ రవికుమార్, గ్రామీణ సీఐ రవి రాజు, ఇన్స్పెక్టర్లు లతీఫ్, సత్యనారాయణ, దత్తాత్రేయ, తోగుట సీఐ శ్రీను, సైబర్ క్రైమ్ బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.