పాల్వంచ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని(Police Martyrs' Day) పురస్కరించుకొని శుక్రవారం పాల్వంచలో నిర్వహించిన రక్తదాన శిబిరం(Blood Donation Camp) విజయవంత మైంది. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు, ఇతర రోగుల అవసరాల నిమిత్తం పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పాల్వంచ డి.ఎస్.పి ఆర్.సతీష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ కె. సతీష్ కుమార్, పాల్వంచ టౌన్ ఎస్సైలు టి. నాగరాజు, జి. విజయ, పాల్వంచ రూరల్ ఎస్సై సురేష్, ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. పాల్వంచ పట్టణానికి చెందిన పలువురు ప్రజలు, యువత స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 108 మంది రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ఆర్. సతీష్ ,సీఐ కె. సతీష్ కుమార్ మాట్లాడుతూ, రక్తదానం చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలను అభినందించారు. రక్తదానం అనేది మరొకరి ప్రాణాలను కాపాడే గొప్ప సేవ అని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.