డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేయాలి

31-10-2026 | 12:57am

- కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): వ్యవసాయ రంగంలో డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేయడంతో పాటు రైతులకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు సులభంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రిస్టాక్ డిజిటల్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో అగ్రిస్టాక్ అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం అగ్రీ స్టాక్ డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెట్టిందని, ఇందులో రైతు గుర్తింపు సంఖ్య, భౌగోళిక సమాచారంతో కూడిన గ్రామ మ్యాపుల నమోదు, పంట సాగు నమోదు రిజిస్ట్రీలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో రైతు ఐడిల నమోదులో 70.4 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని, జిల్లాలోని గ్రామాల మ్యాపులను జియో రిఫరెన్స్ చేయడం జరిగిందని తెలిపారు. వానాకాలం 2026 సీజన్‌కు సంబంధించి జిల్లాలో వ్యవసాయ ప్లాట్లు డిజిటల్ క్రాప్ సర్వేకు గుర్తించగా, స్వచ్ఛంద కార్యకర్తల ద్వారా పంటల వివరాలను 88.63 శాతం నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

వ్యవసాయ శాఖతో పాటు మార్కెటింగ్, పౌరసరఫరాలు, ఎరువుల నిర్వహణ, విత్తన పంపిణీ, పంటల బీమా, బ్యాంకింగ్, వ్యవసాయ రుణాలు, పిఎం కిసాన్, వ్యవసాయ యాంత్రీకరణ తదితర రంగాలలో అగ్రిస్టాక్ అప్లికేషన్‌ను వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతుల వివరాల ఆధారంగా ఎరువుల బుకింగ్, విక్రయాలు, విత్తనాల పంపిణీ, ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లు, పంటల బీమా, వ్యవసాయ రుణాలు వంటి సేవలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని వివరించారు. అగ్రిస్టాక్ ద్వారా వివిధ శాఖల మధ్య సమన్వయం పెంపొందించి రైతులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు