'సురక్షిత సిద్దిపేట' సాధనకు కృషి చేయాలి
- పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారితో మర్యాదగా వ్యవహరించాలి
- సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి): ప్రజల్లో నమ్మకం పెంచేలా పోలీసింగ్ ఉండాలని, అందరూ కలిసికట్టుగా పనిచేసి 'సురక్షిత సిద్దిపేట' సాధనకు కృషి చేయాలని సీపీ రష్మి పెరుమాళ్(CP Rashmi Perumal) పిలుపునిచ్చారు. సిద్దిపేట మహిళా పోలీస్ స్టేషన్(Siddipet Women Police Station) అధికారులు, సిబ్బందితో సీపీ శనివారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులతో వ్యవహరించే తీరు, అవగాహన కార్యక్రమాలు, మహిళా రక్షణ(Women's protection) చర్యలపై సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులు, వారి కౌన్సెలర్లతో శాంతంగా, ఓర్పుతో మాట్లాడాలని సూచించారు. సమస్యలను సమగ్రంగా విని, ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి సాధ్యమైనంత వరకు పరిష్కరించేలా చొరవ చూపాలని తెలిపారు. విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు నాణ్యమైన అవగాహన కార్యక్రమాలను పాఠశాలలు, కళాశాలల్లో క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో మహిళలు, యువతులు ఎదుర్కొంటున్న సైబర్ మార్ఫింగ్, సోషల్ మీడియా వేధింపులు, ఆన్‌లైన్ మోసాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. క్విక్ రెస్పాన్స్ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులు, ఉద్యోగినులకు ప్రాథమిక ఆత్మరక్షణ నైపుణ్యాలను నేర్పించేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ దుర్గ, భరోసా సిబ్బంది పాల్గొన్నారు.