తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ..!
11 తులాల బంగారం, 82 తులాల వెండి, రూ.లక్ష నగదు అపహరణ
గంభీరావుపేట నవంబర్ 23 (విజయక్రాంతి): ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు తాళాలు పగులగొట్టి భారీ చోరీకి(Grand theft) పాల్పడ్డారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట గ్రామంలో(Gambhiraopet village) చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మారవేణి పరశురాములు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ నెల 22న మధ్యాహ్నం భార్య, పెద్ద కుమారుడితో కలిసి వేములవాడలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లాడు. సోమవారం 23న ఉదయం 6 గంటలకు తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో పాటు బీరువా తాళం కూడా పగులగొట్టి ఉంది.
బీరువాలో భద్రపరిచిన సుమారు 11 తులాల బంగారు ఆభరణాలు, 82 తులాల వెండి ఆభరణాలు, రూ.లక్ష నగదును గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు బాధితుడు గుర్తించాడు. దీంతో బాధితుడు సోమవారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా,డాగ్ స్కాడ్, క్లూస్ టీం తో వివరాలను సేకరించారు.ఎస్ఐ ఆర్. బాలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును ఇంట్లో ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ బాలరాజు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.