ప్రజావాణికి 131 ఫిర్యాదులు
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్లు
బోధన్, నవంబర్ 23 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు రాజాగౌడ్(Additional Collector Rajagoud), భుజంగరావు సూచించారు. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై మొత్తం 131 ఫిర్యాదులను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావుతో పాటు డీఆర్వో గీత, డీఆర్డీవో సాయన్న, జెడ్పీ సీఈవో సాయాగౌడ్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను ఫిర్యాదుదారులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ఎంతో ఆశతో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తున్నందున అధికారులు ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయకుండా, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు సూచించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.