నాయిని రాజేంద‌ర్ రెడ్డి 24 గంటల స‌మ‌యం ఇస్తున్నా..

23-11-2026 | 08:25pm

దమ్ముంటే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయాలని డిమాండ్

మాజీ చీఫ్ విప్‌, మాజీ శాస‌న‌స‌భ్యులు దాస్యం విన‌య్ భాస్క‌ర్..

హనుమకొండ, నవంబర్ 23 (విజయక్రాంతి): రాజకీయాల్లో విలువలు పాటించాలని, వ్యక్తిగత విమర్శలు, చిల్లర మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్(Former MLA Vinay Bhaskar) హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన అనుచరులు చేస్తున్న వ్యాఖ్యలతో తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని,కేసీఆర్‌పై విమర్శలు చేసే ముందు ఆయన స్థాయిని, తెలంగాణకు చేసిన సేవలను గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

సోమవారం బాలసముద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ మాజీ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ నాయిని రాజేంద‌ర్ రెడ్డి నీకు 24 గంట స‌మ‌యం ఇస్తున్నా, దమ్ముంటే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి ఎన్నికలకు రా అని స‌వాల్ విసిరారు. మళ్ళీ స్వయంగా పోటీ చేయడానికి సిద్ధమని, నీకు నా స్థాయి ఎక్కువ కాబ‌ట్టి, అవసరమైతే బీఆర్ఎస్ తరఫున మరో అభ్యర్థిని బరిలోకి దింపుతామని సవాల్ విసిరారు. ద‌మ్ము ఉంటే రాజీనామా చెయ్‌ ఓడిపోతే, రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొని ప్ర‌జా జీవితంలో కొనసాగుతానని స్పష్టం చేశారు.

వరంగల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రచారంపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాలనీల్లో చిన్నచిన్న పనులకు హడావుడిగా శంకుస్థాపనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. గతంలో తాను చేపట్టిన రోడ్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, కమ్యూనిటీ హాళ్లు, కాంపౌండ్ వాల్స్ వంటి అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ ప్రస్తుత పాలకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దమ్మగడ్డ శ్మ‌శాన వాటిక స్థ‌లం, న్యూశాయంపేట దేవాలయ భూములను క‌బ్జా చేయాల‌ని చూశావ‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల అమలుపై దృష్టి పెట్టాలని, కేసీఆర్‌, కేటీఆర్‌లపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాజకీయాల్లో అహంకారం, అధికార దుర్వినియోగం ఎక్కువకాలం సాగవని హెచ్చరించారు.

మాజీ శాస‌న‌స‌భ్యులు న‌న్న‌పునేని న‌రేంద‌ర్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు మాట్లాడే ముందు విషయ పరిజ్ఞానం, రాజకీయ అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. సినిమా డైలాగులతో రాజకీయాలు చేయలేరని, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై అవగాహనతో మాట్లాడాలని సూచించారు. వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో నిధుల కొరత ఉందంటూనే వేల కోట్ల అభివృద్ధి చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించి పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రంగులు వేసి తన ఘనతగా చెప్పుకుంటోందని ఆరోపించారు.

కళాక్షేత్రం నిర్వహణకు నిధులు లేవంటూ కుడా కార్యాలయాన్ని అక్కడికి తరలించి అద్దెల ద్వారా ఆదాయం పొందాలని చూడటం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి నిదర్శనమని విమర్శించారు.ఉద్యోగులు, ఏఎన్ఎంలు, ఔట్‌సోర్సింగ్‌ వైద్యులు, పెన్షనర్లు, ద‌ళిత‌బంధు పథకం లబ్ధిదారులకు ఇచ్చిన హామీల అమలుపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయడం తగదన్నారు.అభివృద్ధి, రాజకీయ అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 

అంబేద్కర్‌,హ‌నుమ‌కొండ‌ చౌరస్తాలో చర్చకు రావాలని ప్రత్యర్థి నాయకుడికి సవాల్‌ విసిరారు.వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి తాను, బీఆర్ఎస్ శ్రేణులు చ‌ర్చ‌కు సిద్ధం అని తేదీ, సమయం మీరే నిర్ణయించండి, మేం సిద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌లపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని, రాజకీయాల్లో విలువలు పాటించాలని హితవు పలికారు.పార్టీ మారిన నాయకులు ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

గతంలో మహిళా అభ్యర్థులకు ఇచ్చిన హామీలు, వారి రాజకీయ ప్రాధాన్యత విషయంలో కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించిన తీరుపై ప్రశ్నలు సంధించారు.వరంగల్‌లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రస్తుత ప్రభుత్వ పాలన, నిధుల వినియోగంపై పూర్తి వివరాలతో చర్చకు వస్తామని స్పష్టం చేశారు.ఈ స‌మావేశం లో మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, మాజీ చైర్మ‌న్లు డా.వాసుదేవ‌రెడ్డి, మర్రి యాదవ రెడ్డి, సంగంరెడ్డి సుంద‌ర్ రాజ్ యాద‌వ్‌, సుధీర్ కుమార్‌, రైతు స‌మ‌న్వ‌య స‌మితి మాజీ బాధ్యులు ఎల్లావుల ల‌లిత యాద‌వ్‌, నాయ‌కులు పులి రజినీకాంత్‌, రామ్మూర్తి, వెంక‌న్న‌, అనిల్ కుమార్‌, వినీల్ రావు, రాజు యాద‌వ్‌, శ్రీ‌ధ‌ర్‌, సారిక త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు