రెండు రాష్ట్రాల స్థాయి సోలో డాన్స్ పోటీలు ఘన విజయం
కళాకారుల ప్రతిభకు వేదిక.. వందలాది మంది సభ్యులకు దండు సారయ్య చేయూత...
ఇల్లెందు టౌన్, నవంబర్ 23 : భద్రాద్రి 24 క్రాఫ్ట్స్ యూనియన్(Crafts Union) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి సోలో డాన్స్ పోటీలు(Telangana and Andhra Pradesh State Level Solo Dance Competitions) ఘన విజయం సాధించాయి. స్థానిక ఎమ్మార్జీ నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పోటీలు రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి. రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
చిన్నారుల నుంచి యువత వరకు వివిధ విభాగాల్లో కళాకారులు ఉత్సాహంగా పోటీపడి ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమానికి యూనియన్ గౌరవ అధ్యక్షులు, 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య, ఖమ్మంకు చెందిన డాక్టర్ ఆకుల లక్ష్మి, పాఠశాల కరస్పాండెంట్ వంగూరి శ్రీనివాసరావు, 19వ వార్డు కౌన్సిలర్ పింగళి అనన్య నరేష్, దంత వైద్యురాలు తినిషా బిందు, ఇల్లెందు టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు దాసరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొని కళాకారులను అభినందించారు.
కళాకారుల సంక్షేమానికి దండు సారయ్య చేయూత
యూనియన్ సభ్యుల సంక్షేమానికి గౌరవ అధ్యక్షులు దండు సారయ్య ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వందలాది మంది యూనియన్ సభ్యులకు తన సొంత ఖర్చులతో గుర్తింపు కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారు. కళాకారులకు గుర్తింపుతో పాటు భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా నిధులు వెచ్చించడం పట్ల యూనియన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కళాకారుల అభ్యున్నతికి ఆయన అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడుతూ యూనియన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పోటీల్లో విజేతలు వీరే
హైదరాబాద్కు చెందిన అర్జున్ మాస్టర్, భూపాలపల్లికి చెందిన రమేష్ మాస్టర్, సత్తుపల్లికి చెందిన నవ్య మౌనిక మాస్టర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వెస్ట్రన్ సీనియర్ సోలో విభాగంలో విజయవాడకు చెందిన చెర్రీ ప్రథమ, ఖమ్మంకు చెందిన అభి ద్వితీయ, కడపకు చెందిన చందు, పాల్వంచకు చెందిన శశిధర్ తృతీయ బహుమతులు సాధించారు. వెస్ట్రన్ జూనియర్ విభాగంలో విశాఖపట్నానికి చెందిన ప్రకృతి ప్రథమ, విజయనగరానికి చెందిన ప్రశాంతి ద్వితీయ, హైదరాబాద్కు చెందిన ఆద్విక తృతీయ స్థానాల్లో నిలిచారు.
ఫోక్ జూనియర్ విభాగంలో రిషిక ప్రథమ, హస్వికా రావు ద్వితీయ, సంకీర్తన తృతీయ బహుమతులు అందుకున్నారు. క్లాసికల్ సీనియర్ విభాగంలో అజయ్ కుమార్ ప్రథమ, శ్వేత వర్ధిని, యువజన శ్రీ ద్వితీయ, అమృత, కృష్ణ తృతీయ స్థానాలు సాధించారు. క్లాసికల్ జూనియర్ విభాగంలో భువనచంద్రిక ప్రథమ, శ్రీవేదిక, నాగరక్షక ద్వితీయ, యశ్వర్దిక తృతీయ బహుమతులు గెలుచుకున్నారు.
పోటీల్లో పాల్గొన్న ప్రతి కళాకారుడికి షీల్డ్, ప్రశంసాపత్రం అందజేశారు. విజేతలకు నగదు బహుమతులతో పాటు షీల్డులు, సర్టిఫికెట్లు ప్రదానం చేసి సత్కరించారు.
కళాకారులకు రాష్ట్రస్థాయి గుర్తింపు లక్ష్యం
కళాకారుల్లోని ప్రతిభను వెలికితీయడం, నృత్య కళను ప్రోత్సహించడం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల కళాకారులకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పోటీలు నిర్వహించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులోనూ కళాకారుల అభ్యున్నతికి మరిన్ని రాష్ట్రస్థాయి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కడారి వెంకటేష్, జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్, నయీమ్, దిలీప్, పృథ్వీ, దీపక్, రాజేష్, సాయిరాం, ప్రతాప్, కార్తిక్, పావని, చిట్టి, శిరీష తదితరులు పాల్గొన్నారు.