దుబాయ్‌లో ఘనంగా కార్తీక మాస వనభోజనాలు

24-11-2026 | 06:20pm

సుల్తానాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): దుబాయ్‌లోని అల్ ఖుసైస్ పాండ్ పార్క్‌లో యూఏఇ పద్మశాలి కుటుంబాల(Padmashali Families) ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలను ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ వేడుకకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని వివిధ ప్రాంతాల నుండి 200 మందికి పైగా పద్మశాలి కుటుంబ సభ్యులు, చిన్నారులు, మహిళలు, పెద్దలు పాల్గొని వన భోజనాల కార్యక్రమాన్ని ఉల్లాసభరితంగా జరుపుకున్నారు. విదేశాల్లో నివసిస్తున్న పద్మశాలి కుటుంబాల మధ్య ఆత్మీయతను పెంపొందించడం, మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడం, అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం కోసమే వనభోజనాలను నిర్వహించినట్లు నిర్వాహకులు సదానంద్, లక్ష్మీనారాయణ, అశోక్ తెలిపారు.

ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ వేడుకలో ఆటపాటలు, నవ్వులు, సందడితో పార్క్ అంతా పండుగ వాతావరణం నెలకొంది, కార్యక్రమంలో నిర్వహించిన వివిధ రకాల సరదా ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దంపతుల కోసం నిర్వహించిన కపుల్స్ గేమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భార్యాభర్తలు ఉత్సాహంగా పాల్గొని తమ సరదా, చమత్కారాలతో అందరినీ నవ్వించారు. చిన్నారులు, మహిళలు, పెద్దలు సైతం వివిధ ఆటల్లో పాల్గొని ఆనందంగా గడిపారు.సంగీతం, పాటలతో కార్యక్రమానికి మరింత కళ వచ్చింది. పలువురు తమ గాన ప్రతిభను ప్రదర్శించి అందరినీ అలరించారు. 

తెలుగు వంటకాలతో విందు భోజనం

వనభోజనాల్లో మరో ప్రత్యేక ఆకర్షణ నోరూరించే రుచికరమైన తెలుగు సంప్రదాయ వంటకాలు. ఆత్మీయంగా అందించిన రుచికరమైన భోజనాన్ని కుటుంబ సభ్యులందరూ కలిసి ఆస్వాదించారు. విదేశాల్లో ఉన్నప్పటికీ మన ఇంటి భోజనాన్ని, పల్లెటూరి వనభోజనాల అనుభూతిని గుర్తుచేసేలా ఆహార ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా పలువురు పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ వనభోజనాలు కేవలం ఒక కుటుంబ సమ్మేళనం మాత్రమే కాకుండా, యూఏఈ లో నివసిస్తున్న పద్మశాలి కుటుంబాల ఐక్యతకు,స్నేహసంబంధాలకు, మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తాయని పలువురు పద్మశాలి సంఘం నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో యూఏఈ పద్మశాలి సంఘం నాయకులు సదానంద్, లక్ష్మీనారాయణ, అశోక్, వాలంటీర్లతో పాటు పెద్ద సంఖ్యలో పద్మశాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు