భూముల రీ సర్వేపై రైతులు అవగాహన కలిగి ఉండాలి
సాదా బైనామా భూముల విషయంలో అర్హులైన రైతులకు న్యాయం చేస్తాం
ముత్తారం తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆంజనేయులు
ముత్తారం, అక్టోబర్ 26 (విజయక్రాంతి): భూముల రీ సర్వేపై రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సాదా బైనామా భూముల విషయంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని ముత్తారం నూతన తహసీల్దార్ ఆంజనేయులు(Tahsildar Anjaneyulu) తెలిపారు.
సాధారణ బదిలీల్లో భాగంగా మంథని ఆర్డీఓ కార్యాలయంలో డీఈవోగా విధులు నిర్వహిస్తున్న అంజయ్య ముత్తారం తహసీల్దార్‌గా బదిలీపై వచ్చారు. ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన మధుసూదన్ రెడ్డి మంథని ఆర్డీఓ కార్యాలయానికి డీఈఓగా బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన ముత్తారం తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల రీ సర్వేకు సంబంధించి రైతులు తమ భూముల వివరాలు, రికార్డులు, సర్వే నంబర్లపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి రైతులు అవసరమైన పత్రాలతో కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.
సాదా బైనామా భూములకు సంబంధించి అర్హులైన రైతుల సమస్యలను ప్రభుత్వ నిబంధనల మేరకు పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలకు రెవెన్యూ సేవలను అందించడంలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ, భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నూతనంగా బదిలీపై వచ్చిన తాసిల్దార్ కు సిబ్బంది, ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు.