శాస్త్రవేత్తల విజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి

06-11-2026 | 08:31pm

'ఆత్మ' పిడి తిరుమల ప్రసాద్

​సాలూర, నవంబర్ 06 (విజయక్రాంతి): ​వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకుంటూ​ శాస్త్రవేత్తల అనుభవాలను రైతులు క్షేత్రస్థాయిలో అమలు చేసినప్పుడే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని సేంద్రీయ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ తిరుమల ప్రసాద్ పిలుపునిచ్చారు. ​సాలూర మండల కేంద్రంలోని రైతు వేదికలో 'ఆత్మ' ఆధ్వర్యంలో శుక్రవారం పూర్వ అభ్యాస గుర్తింపు ప్రత్యేక అవగాహన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మ పిడి తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ... ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు​, జగిత్యాల వ్యవసాయ కళాశాల సంయుక్త సహకారంతో రైతుల కోసం ఈ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ​​ఈ సందర్భంగా వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు, ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తే వర్షపాత అస్థిరతపై అధికారులు రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నీటి పొదుపును పాటిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు, సమగ్ర వ్యవసాయ పద్ధతులు చేపట్టాలని సూచించారు. బోధన్ వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీనివాస్  మాట్లాడుతూ... గతంలోనూ కరువు పరిస్థితులు ఎదురైనప్పుడు నిజామాబాద్ రైతాంగం చూపిన చొరవను, చెరకు తోటల్లో అంతర పంటగా పొద్దుతిరుగుడు సాగు చేసి అధిక దిగుబడి సాధించిన నైపుణ్యాన్ని ఈ వేదికపై అధికారులు గుర్తుచేసి అభినందించారు.

సదస్సులో భాగంగా గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో ఉన్న అగ్రికల్చర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత నాలుగు నెలలుగా గ్రామాల్లో పర్యటిస్తూ తాము తెలుసుకున్న వ్యవసాయ విజ్ఞానం, సాగు పద్ధతులు, విత్తన నమూనాలను విద్యార్థులు ప్రదర్శించగా, అధికారులు మరియు రైతులు తిలకించి వారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సోక్కం లావణ్య రవి, అల్లె రమేష్, సాలూర మండల వ్యవసాయ అధికారి శ్వేత, వ్యవసాయ విస్తరణాధికారులు ఉమా, ముజామిల్, రుద్రూర్ కేవీకే శాస్త్రవేత్త ఇంధుధర్ రెడ్డి, జగిత్యాల వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ ప్రతినిధులు సౌజన్య, అర్చన, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు