దసరా వేళ ఊరికి వెళ్తే... ఇంటికి భద్రతం
దసరా పండుగ సెలవుల్లో అప్రమత్తంగా ఉండండి... నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.
నిజామాబాద్ అక్టోబర్ 6, (విజయ క్రాంతి): దసరా పండుగ సెలవుల్లో కుటుంబ సమేతంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రజలు ఇళ్ల భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య(Nizamabad Police Commissioner Sai Chaitanya) సూచించారు. పండుగ సెలవులను ఆసరాగా చేసుకుని తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఇంటిని ఖాళీ చేసి వెళ్లే ముందు విలువైన నగదు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్‌లో భద్రపరచుకోవాలని సూచించారు. విద్యుత్, గ్యాస్, ఫ్రిజ్ తదితరాలను సురక్షితంగా ఆఫ్ చేసి, తలుపులు, కిటికీలకు పటిష్టంగా తాళాలు వేయాలని తెలిపారు. ఇరుగు పొరుగు వారికి సమాచారం అందించి ఇంటిపై నిఘా ఉంచేలా చూడాలని, కాలనీ వాసులు సమన్వయంతో గస్తీ ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
అనుమానాస్పద వ్యక్తులు, ఇంటింటికీ తిరుగుతూ వస్తువులు విక్రయించే అపరిచితుల కదలికలను గమనించాలని, మహిళలు, వృద్ధులు అపరిచితుల మాటలు నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తాము ఊరికి వెళ్తున్న విషయాన్ని ముందుగానే సోషల్ మీడియాలో పోస్టు చేయకుండా, తిరిగి ఇంటికి చేరిన తర్వాతే ఫొటోలు, ప్రయాణ వివరాలను పంచుకోవాలని సీపీ తెలిపారు.
తాళం వేసి వెళ్లే ముందు సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు సమాచారం అందించి పోలీస్ శాఖకు సహకరించాలని సీపీ సాయి చైతన్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు.