భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ
106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం
కార్మిక చట్టాల పరిరక్షణకు కదలాలి
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమాలే శరణ్యం
కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా
కొత్తగూడెం టౌన్,(విజయక్రాంతి): కొత్తగూడెం : భారత కార్మిక వర్గ పోరాటాలకు అసలైన దిక్సూచి ఏఐటీయూసీ మాత్రమేనని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా స్పష్టం చేశారు. స్థానిక పెద్దబజార్లోని హమాలీ అడ్డాలో శుక్రవారం జరిగిన హమాలీ కార్మికుల సమావేశంలో అయన మాట్లాడారు. ఈ 106 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన ఘనత ఏఐటీయూసీకి మాత్రమే దక్కుతుందన్నారు. దేశంలో కార్మికులు రక్తం ధారపోసి సాధించుకున్న హక్కులను కేంద్ర పాలకులు కాలరాస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల వల్ల అసంఘటిత, సంఘటిత రంగ కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలను రద్దు చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం దుర్మార్గమన్నారు. అక్టోబర్ 31న జరుపుకుంటున్న ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా ఈ వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవాలని, ఆవిర్భావ దినోత్సవ స్పూర్తితో కార్మిక హక్కుల సాధనే లక్ష్యంగా కదలాలన్నారు.
పాలకుల అణచివేత చర్యలను తిప్పికొట్టడానికి కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాటాలు నిర్మిస్తామని ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్మిక ఐక్యతే ఆయుధంగా ముందుకు సాగి చట్టాలను కాపాడుకోవాలన్నారు. హమాలీల సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పాలకుల విధానాలపై రాబోయే రోజుల్లో సమరశీల పోరాటాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తరాల రాజు, నీలం మొగిలి, వెలిశాల మోహన్ రావు, కత్తెర శ్రీనివాస్, అశోక్, సర్పంచ్ రామనాథం తదితరులు పాల్గొన్నారు.