పండగ జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం.!

31-10-2026 | 12:12am

- బకెట్ నీటిలో పడి బాలుడు మృతి

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మరో రెండు రోజుల్లో ఇంట్లో పండగ జరగాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఇల్లంతా సందడిగా ఆడుకుంటూ తిరిగే 15 నెలల పసి బాలుడు బకెట్ నీటిలో మునిగి మృతిచెందిన ఘటన నాగర్ కర్నూల్ పట్టణం ఎండబెట్ల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిసిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జంగయ్య శివలీల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

మొదటి కుమార్తె పుష్పాలంకరణ కార్యక్రమం మరో రెండు రోజుల్లో జరగనుండగా కుటుంబ సభ్యులు బంధువులు పిండి వంటలు చేసుకుంటూ ఉన్నారు. తన 15 నెలల వయసుగల కుమారుడు లోకేష్ ( చిన్ను ) ఇంటి ముందరే ఆడుకుంటూ బాత్రూంలోని బకెట్ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు బకెట్ నీటిలో పడ్డాడు. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి స్పృహ తప్పి ఉన్నాడు. వెంటనే జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నలుముకుంది.

మరిన్ని వార్తలు